వినియోగదారుల మండలి సభ్యుడిగా సుల్తాన్ అలీ
విశ్వంభర, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నుండి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి (స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్) అనధికార సభ్యుడిగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయవాది, 'ఆసరా' వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) ఇలక్కియ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పదవిలో ఉన్న రవి శోభారాణి స్థానంలో హబీబ్ సుల్తాన్ అలీని నామినేట్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు సిఫార్సు చేశారు.హబీబ్ సుల్తాన్ అలీ నేపథ్యం, సేవలు సామాజిక బాధ్యత అవగాహన కోసం న్యాయవాదుల సంఘం (ఆసరా ) సంస్థను 2016లో స్థాపించిన హబీబ్ సుల్తాన్ అలీ, ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా కమిటీల ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నారు.ఆయన నాయకత్వంలో ఆసరా సంస్థ ద్వారా ఇప్పటివరకు 10,000 కు పైగా వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను మధ్యవర్తిత్వం, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల కోర్టులు, న్యాయస్థానాల్లో 275కి పైగా కేసులు దాఖలు చేసి వినియోగదారులకు న్యాయం చేకూర్చారు. సమాజానికి ఆయన అందిస్తున్న ఈ విశేష సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు.వినియోగదారుల హక్కుల పరిరక్షణ పట్ల ఆయనకున్న అపారమైన అనుభవం, నిబద్ధతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడిగా ఆయనను ఎంపిక చేశారు.



