ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
విశ్వంభర, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను రైల్ నిలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; ఎస్సీ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి; విభాగాల ప్రధాన అధిపతులు, అధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల స్కిట్, మహిళా ఉద్యోగులచే నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా, జనరల్ మేనేజర్ 2025-2026 సంవత్సరానికిగాను వివిధ విభాగాలలోని ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. వక్తృత్వం మరియు వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ సంవత్సరం నేపధ్యం ‘ గివ్ టు గెయిన్’ అని, సాధికారతకు కీలకం అయిన విద్య ద్వారా లాభం పొందడానికి ఉత్తమ మార్గం అని ఆయన నొక్కి చెప్పారు. ఇంకా, మహిళా సాధికారత పరంగా సమానత్వం మరియు సమన్యాయం మధ్య వ్యత్యాసాన్ని ఆయన హైలైట్ చేశారు. సమానత్వం అంటే ఆడ మగ వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు మరియు చికిత్స అందించడం అని ఆయన వివరించారు. అయితే సమన్యాయం అంటే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి వనరులు మరియు మద్దతును అందించే ప్రక్రియ, న్యాయమైన ఫలితాలను అందించడం అని ఆయన వివరించారు. మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మనం చాలా సాధించాం మరియు సఫలీకృతమైయామని మరియు ఇంకా సౌకర్యాలు చాలా కల్పించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని 5 కీలకమైన విభాగాలు, ఆపరేటింగ్, కమర్షియల్, సెక్యూరిటీ, ఫైనాన్స్, మెడికల్ మరియు గుంటూరు డివిజన్‌లను సమర్థవంతమైన మహిళా అధికారులు నడిపించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎస్. సి సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ; ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె. పద్మజ ; ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హేమ సునీత ; ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మలా రాజారాం ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే; గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.



