24న సిపిఐ చలో అసెంబ్లీ

24న సిపిఐ చలో అసెంబ్లీ

విశ్వంభర, హైదరాబాదు : పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఖమ్మం, హైదరాబాదు, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాదులోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర సమితి సమావేశం అనంతరం బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సమితి నిర్ణయాలను వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ పరిస్థితులు, పెరిగిన గ్యాస్‌, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, రైతు బంధు చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సింగరేణి పరిరక్షణ కోసం ఈ నెల 18 నుంచి 30 వరకు అధికార యూనియన్ చేపట్టనున్న బస్సు యాత్రకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అమెరికా యుద్ధ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి స్పందించాలని, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సిపిఐ పూర్తిగా వ్యతిరేకమని, ఫిరాయించిన వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా కఠిన చట్టం తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నరసింహా, కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, బాల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: