అనిల్ అంబానీకి ఈడీ షాక్.. పాలిహిల్‌లోని 'అబోద్' నివాసాన్ని జప్తు చేసిన ఈడీ

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. పాలిహిల్‌లోని 'అబోద్' నివాసాన్ని జప్తు చేసిన ఈడీ

 ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి‌హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 66 మీటర్ల ఎత్తులో కళ్లు చెదిరేలా ఉండే అనిల్ అంబానీ నివాసం ‘అబోద్’ ఇప్పుడు ప్రభుత్వ పరం కానుంది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి‌హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 66 మీటర్ల ఎత్తులో కళ్లు చెదిరేలా ఉండే అనిల్ అంబానీ నివాసం ‘అబోద్’ ఇప్పుడు ప్రభుత్వ పరం కానుంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా సాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ భారీ ఆస్తిని జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.3,716.83 కోట్ల విలువ చేసే ఈ భవనాన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో తాజా జప్తుతో కలిపి ఇప్పటివరకు అంబానీ గ్రూప్‌కు చెందిన మొత్తం రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తన పరిధిలోకి తీసుకుంది.

అక్రమ నిధుల మళ్లింపుపై సిబిఐ నిఘా
ఈ మొత్తం వ్యవహారం వెనుక వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల కుంభకోణం దాగి ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అనిల్ గ్రూప్ కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి పొందిన రుణాలను నిర్దేశించిన ప్రయోజనాల కోసం కాకుండా ఇతర అవసరాలకు అక్రమంగా మళ్లించాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, నిధులు ఎక్కడికి చేరాయనే అంశంపై దృష్టి సారించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా గ్రూప్‌లోని పలు కీలక సంస్థల నుంచి సుమారు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు లేదా ఇతర డొల్ల కంపెనీలకు తరలించారనే ఆరోపణలపై తీవ్రస్థాయిలో సోదాలు నిర్వహించారు.

Read More 10 నిమిషాల డెలివరీకి బ్రేక్

విస్తృత సోదాలు.. పక్కా ఆధారాలు
గతేడాది జూలై నెలలో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన సుమారు 50 కంపెనీల కార్యాలయాల్లో, 35 భౌగోళిక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ సోదాల్లో అనిల్ అంబానీకి అత్యంత సన్నిహితులైన 25 మందిని ప్రశ్నించడమే కాకుండా, కీలకమైన డిజిటల్ పత్రాలను, డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సేకరించిన సాక్ష్యాధారాలు నిధుల అక్రమ రవాణా జరిగినట్లు బలమైన సంకేతాలు ఇవ్వడంతో, ఉన్నతాధికారులు ఆస్తుల జప్తు దిశగా అడుగులు వేశారు.