ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు అభినందన
విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం యువ ఆపదమిత్ర శిక్షణ పొంది ఉత్తమ ప్రతిభ కనబరిచిన సురేష్, మహేష్, చంద్రశేఖర్, సాయి, సమీర్, రేష్మ, భవాని, ఆసియా, భావన, మౌనిక మొదలగు విద్యార్థినీ, విద్యార్థులను బీహార్ రాష్ట్రంలోని ససారంలో జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్న సాయి తేజను, (మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ తరఫున) వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తాటిశెట్టి శ్రీనివాసులును ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాహత్ ఖానం మాట్లాడుతూ, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పదిమంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందివ్వడం జరిగిందనీ, ఈ శిక్షణ కార్యక్రమంలో వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, రోడ్డు ప్రమాదాలు తదితర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు క్షతగాత్రులను ఏ విధంగా కాపాడాలి, వారిని ఏ విధంగా సురక్షిత ప్రదేశాలకు తరలించాలి, వారికి ప్రధమ చికిత్స ఏ విధంగా చేయాలి, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ఏ విధంగా ప్రాణాలను రక్షించాలి, నీళ్లలో, పెద్దపెద్ద నదులలో పడిపోయిన వ్యక్తులను, జంతువులను ఏ విధంగా కాపాడాలి, బహుళ అంతస్తుల భవనాల శిథిలాలలో చిక్కుకున్న వారిని ర్యాఫ్లింగ్ (అసెండింగ్, డిసెండింగ్) ద్వారా వెళ్లి ఏ విధంగా కాపాడాలి మొదలగు అంశాలపై పది రోజులపాటు శిక్షణను ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, హైడ్రా బృందాల ద్వారా శిక్షణను ఇప్పించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ వచ్చిన విద్యార్థులకు గవర్నర్ విష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్ రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని ఎం.అనిత, డాక్టర్ కిషన్, డాక్టర్ రవీందర్ రావు, జి.నరేష్, ఏ.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



