"నా జీవితంలో అతి పెద్ద తప్పు"
- ఎప్‌స్టీన్ ఇష్యూపై బిల్ గేట్స్ క్షమాపణలు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వ్యవహారంపై బిల్ గేట్స్ మరోసారి వివరణ ఇచ్చారు. తనతో ఎప్‌స్టీన్ మధ్య జరిగిన సమావేశాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో.. గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎప్‌స్టీన్‌తో గడిపిన సమయంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. "నేను జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కలిసి గడిపిన ప్రతి నిమిషాన్ని బాగా విచారిస్తున్నాను. అది నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు" అని స్పష్టం చేశారు. ఫౌండేషన్ ఉద్యోగులను కూడా ఆ సమావేశాల్లోకి తీసుకురావడం చాలా పెద్ద పొరపాటు అని అంగీకరించారు. ఈ వ్యవహారంలో గేట్స్ ఫౌండేషన్ కు క్షమాపణలు తెలియజేసారు. ఆ నిర్ణయం వల్ల ఫౌండేషన్ సిబ్బంది, తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ మేరకు బిల్ గేట్స్ ఓ లేఖ విడుదల చేసారు. "ఈ విషయం వల్ల ఫౌండేషన్‌లోని మా టీమ్ సభ్యులు, కుటుంబం, ఇతరులు ఇబ్బందులకు గురయ్యారని నాకు తెలుసు. వారందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు" అని గేట్స్ తెలిపారు. తన చర్యల వల్ల సంస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని అంగీకరిస్తూ, బాధ్యత తనదేనని పేర్కొన్నారు. అయితే, ఎప్‌స్టీన్‌తో జరిగిన సమావేశాల్లో తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. "ఆయన చుట్టూ ఉన్న మహిళలు లేదా బాధితులతో నేను ఎప్పుడూ సమయం గడపలేదు. నేను ఎలాంటి అనైతిక విషయాలు చూడలేదు, చేయలేదు" అని స్పష్టం చేసారు. ఎప్‌స్టీన్ వ్యవహారంలో బిల్ గేట్స్ పై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలు, గేట్స్ ఫౌండేషన్ కు మాయను తెచ్చి పెట్టాయనేది నిజం. ఫౌండేషన్ విలువలకు, సంస్థ లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకమైన గేట్స్ చర్యపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్ గేట్స్ తాజా ప్రకటనతో.. తాను చేసింది ఎంత పెద్ద తప్పో అంగీకరించినట్లయింది.



