గ్యాస్ కొరత లేదు
విశ్వంభర, నిజామాబాద్: ఎల్పీజీ కొరత గురించి వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పది శాతం పెంచడం ద్వారా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని వెల్లడించింది. నిత్యం 60 లక్షల సిలిండర్లు సరఫరా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 60 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు కొనసాగుతున్నాయని తెలిపింది. పారిశ్రామిక రంగం నుంచి గ్యాస్‌ను మళ్లించడం ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారుల కోసం బుకింగ్ వ్యవధిని గతంలో 21 రోజుల నుంచి 25 రోజులకు పొడిగించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేసే సమయం ఇప్పటికీ 2.5 రోజులుగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల గ్యాస్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. అయితే ధర పెరుగుదలలో ప్రస్తుత సరఫరా పరిస్థితులకు సంబంధించినది కాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది గతేడాది ఏర్పడిన ఆర్థిక నష్టాలను సర్దుబాటు చేయడం కోసం మాత్రమే చేపట్టిన చర్య అని పేర్కొన్నాయి.



