గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?

గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?

మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అభ్యర్థులు ఎవరనేది పక్కనపెట్టి, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే 'కారు' గుర్తు చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము పదేళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ హయాంలో ఆగిపోయిన పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసే దావోస్‌లో చర్చలు జరుపుతున్నాయన్నారు. వీరి బండారం బయటపెడతామని కేటీఆర్ తెలిపాు.

సింగరేణి కుంభకోణంపై 'సిట్టింగ్ జడ్జి' విచారణకు డిమాండ్
సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో గతంలో ఎన్నడూ లేనంత దోపిడీ జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్త విధానం పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.6 వేల కోట్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా-ఇ రేసులో తాము 'గ్రీన్ కో'కు లబ్ధి చేకూర్చామని విమర్శించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు దావోస్‌లో వారితోనే చర్చలు జరపడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు. గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.

Read More గౌను గుర్తు చూపిస్తూ 4 వార్డ్ అభ్యర్థి మాధవి ప్రచారం

జిల్లాల రద్దుపై హెచ్చరిక
కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాల తొలగింపుపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల రద్దుకు మీరు అనుమతి ఇచ్చినట్లే అవుతుందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరిట జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు జిల్లాలనే ఎత్తేస్తారా? అని ప్రశ్నించారు. 'ఫ్యూచర్ సిటీ' పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, సికింద్రాబాద్ ఉద్యమకారులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

సీఎం రేవంత్‌కు సవాళ్లు
సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదని, పటాన్‌చెరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం బీఆర్ఎస్‌కే ఓటు వేయమని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆ నిధులతో రాష్ట్రానికి ఏం చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రెండేళ్లుగా కేవలం రాజకీయాల కోసమే సాగదీస్తున్నారని విమర్శించారు.