తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి తీరుపై విద్యార్థుల ఆగ్రహం
విశ్వంభర, కూకట్ పల్లి : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ నిత్యానందరావు విద్యార్థుల పట్ల ప్రదర్శించిన అహంకారపూరిత ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమైంది. సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్లిన విద్యార్థులతో కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుని, వారిని కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల హాస్టల్ మెస్ బకాయిలు చెల్లించలేకపోతున్నామని, తాము పేద విద్యార్థులమని వేడుకున్నప్పటికీ వీసీ కనికరించలేదు. పైగా, "హాస్టల్‌లో ఉంటూ పుక్కిట తింటున్నారు" అంటూ విద్యార్థులను దూషించడం ఆయన స్థాయికి తగని పని. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను హేళన చేస్తూ, "మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు వాడటం లేదా?" అని ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉండి, పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వీసీ నిత్యానందరావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అన్ని విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించారు.



