ప్రజావాణి ఫిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి 

ప్రజావాణి ఫిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి 

  •  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర, సూర్యాపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని,  నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు కూడ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు.  వేసవిలో ప్రజల కొరకు ప్రతి గ్రామపంచాయతీలో బస్ స్టాప్, పబ్లిక్ ప్రాంతాలలో, ఉపాధి హామీ పనులు జరిగే చోట, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని , ఎండ తీవ్రత దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉదయం 11:30 నుండి సాయంత్రం 4:00 వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, తదుపరి 4 గంట నుండి రాత్రి వరకు అవసరమైతే ఫ్లడ్ లైట్లు  పెట్టుకొని రాత్రి 10:00 వరకు కూడ నిర్వహించుకోవచ్చు అని, ఉదయం 4 గంటల నుంచి కూడ కొనుగోళ్లు ప్రారంభించుకోవచ్చని అన్నారు. డిఎం అండ్ హెచ్ ఓ, పీహెచ్ సీల నుండి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, సెలైన్లు  అందుబాటులో ఉంచాలని, కలెక్టరేట్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎండ నుండి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని తలకు క్యాపులు ధరించాలని, కలెక్టరేట్లో కూడా అవసరమైతే మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ పరిపాలన అధికారిని ఆదేశించారు. ప్రతి మండలం నుండి తాసిల్దార్ ద్వారా ప్రతి రోజు టెంపరేచర్ రిపోర్ట్ అందించాలని, ఆర్డబ్ల్యూఎస్, డిపిఓ త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. జనన గణన గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, 26 నుండి ప్రారంభమగు హౌస్ లిస్టింగ్ లో ప్రతి ఉద్యోగి సొంతంగా వారి యొక్క కుటుంబ వివరాలు 33 ప్రశ్నలకు వివరాలు అందించాలని, వెన్యుమరేటర్లు  ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఆ నివేదికను అందించాలని కలెక్టరేట్ లోని ప్రతి శాఖ వారి పరిధిలో గల మండల, గ్రామ కార్యాలయాల  పరిధిలో గల సిబ్బంది ద్వారా ప్రజలకు జనన గణన  గురించి   అవగాహన కల్పించాలని అన్నారు. తదుపరి కలెక్టర్ సిపిఓ ద్వారా  జనన గణన అవగాహన ఫ్లెక్సీ బోర్డును ఆవిష్కరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 31 దరఖాస్తులు,డిఆర్డిఏ 4, మున్సిపాలిటీ 3,   డిపిఓ 3, డిఎం అండ్ హెచ్ ఓ 3  మిగిలిన 17  దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 61 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జడ్పీ శిరీష, డిపిఓ యాదగిరి, డిఎంహెచ్వో పి వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సిపిఓ కిషన్, డీఎస్ఓ, డిటిడిఓ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ డెవలప్మెంట్ అధికారి దయానందరాణి, డి ఐ ఈ ఓ బి సులోచన రాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపర్డెంట్లు శ్రీలత, సాయి,  ఇతర జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Tags: