నెక్స్ట్ వేవ్ సంస్థపై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ

విశ్వంభర, హైదరాబాదు : అనుమతులు లేకుండా విద్యార్థులను మోసం చేస్తున్న ‘నెక్స్ట్ వేవ్’ సంస్థపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతినిధి బృందం ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకిష్టారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి సంస్థలను నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల కాలేదనే కారణంతో ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికేట్లు నిలిపివేయడం అన్యాయమని, దీనిపై కఠిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నాన్-దోస్త్ పరిధిలో అక్రమ అడ్మిషన్లను అరికట్టి, ప్రైవేట్ సంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, ఉపాధ్యక్షుడు కె అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: