నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: దినేష్ కులాచారి
విశ్వంభర, నిజామాబాద్: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మండలం సుద్దపల్లి గ్రామంలో సుమారు 500కు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతన్న ఆరుగాలం పండించిన పంట అకాల వర్షంతో నేలవాలిందని.. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులకు వర్తింపజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇప్పటికి కూడా నష్టపోయిన పంటలను పరిశీలించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోకపోవడం అన్యాయమని దినేష్ వ్యాఖ్యానించారు. రైతన్నలను ఆదుకోవాల్సిన వారు హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం గడపకూడదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్పల్లి మండలం రామడుగు, ఇతర గ్రామంలో కూడా అధికంగా వరి పంటకు నష్టం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి మండల అధ్యక్షుడు నవీన్ యాదవ్ ,డిచ్పల్లి మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, యానంపల్లి సర్పంచ్ భాస్కర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చౌకి లక్ష్మణ్ రమణ, రవినాయక్, పరుశురాం, సుద్ధపల్లి సాంపల్లి, సుద్దపల్లి తండా, సాంపల్లి తండా వివిధ గ్రామస్థులు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.



