ఆర్టీసీ సమ్మెకు టీజేఎంయూ మద్దతు
విశ్వంభర, హైదరాబాదు : టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్ అధ్యక్షతన హైదరాబాదులోని కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీజీఎస్ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేసి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనియన్లను పునరుద్ధరించడం, 2021 మరియు 2025 వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని సూచించారు. స్టాఫ్ చిల్డ్రన్ ఉద్యోగులను మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతి నుంచి తప్పించి రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని, చట్టవ్యతిరేక డ్యూటీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంవీటీడబ్ల్యూ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో కార్మికులతో 7-8 గంటల బదులుగా 14-16 గంటలు డ్యూటీలు చేయిస్తున్నారని, వెంటనే పని భారాన్ని తగ్గించాలని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే చెల్లించి, రిటైర్మెంట్ రోజునే మొత్తం బకాయిలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య, రాష్ట్ర సీవీపీ శ్రీనయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోలి రవీందర్, హైదరాబాదు జోనల్ కార్యదర్శి కృష్ణ, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి నాగేంద్రతో పాటు వివిధ డిపో అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.



