ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలపై ఆందోళన
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై పీపుల్ వాయిస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల ఎమ్మార్వో కు వివిధ ప్రజా సమస్యలపై మెమోరాండం సమర్పించారు. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు, ముఖ్యంగా దుబ్బచర్ల గ్రామంలోని సర్వే నంబర్లు 40, 81/1లోని ప్రభుత్వ అసైన్‌డ్ భూములను తక్షణమే సర్వే చేయాలని కోరారు. ప్రభుత్వ అసైన్‌డ్ భూముల్లో రాత్రివేళల్లో మైనింగ్ మాఫియా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ, అడ్డగోలుగా తరలింపులు చేస్తున్నారని వారు ఆరోపించారు, ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం కలగడంతో పాటు భవిష్యత్తులో భూములపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీనిపై ఎంఆర్ఓ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు గన్నోజు మహేష్ చారి, ప్రధాన కార్యదర్శి నడ్డి నర్సింహా, ఉపాధ్యక్షులు పి. అశోక్, కార్యదర్శి యాపచెట్టు యాదగిరి, కోశాధికారి పి. దేవేందర్, ఎర్ర రాజు, నడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.



