హరీశ్‌రావు కృషితో నీటి సమస్యకు పరిష్కారం
విశ్వంభర, సిద్దిపేట: మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు యష్వాడ నుంచి సిద్దిపేటకు నీరు తీసుకొచ్చి సిద్దిపేట ప్రజల నీటి కష్టాలను తీరిస్తే.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఈనాడు మల్లన్నసాగర్ ద్వారా నీటిని తీసుకొచ్చి నీటి ఎద్దడిని పూర్తిగా తొలగించారని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రూ.10లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హరీశ్‌రావు సహకారంతో సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 5, 6, 7, 22, 26 వార్డుల్లో నీటి సరఫరా కోసం ఎస్టీ హాస్టల్ ప్రాంగణంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగధాంపల్లి, ఇందిరమ్మ కాలనీ, గాడిచర్లపల్లి వద్ద కూడా 10లక్షల కెపాసిటితో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. వాటర్ ట్యాంక్‌ల మంజూరుకు కృషిచేసిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు మున్సిపల్ పాలకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజలందరూ నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరాజు రెడ్డి, సాయికుమార్ గౌడ్, నాయకులు మేర సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.



