సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు

సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు

సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ (MSME)లు పాల్గొనకుండా మూడు ప్లాంట్లను కలిపి ఒకే టెండర్‌గా పిలిచారని, నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని విమర్శించారు.

దేశవ్యాప్తంగా మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ. 3 కోట్లు ఖర్చవుతుంటే, రాష్ట్రంలో మాత్రం రూ. 5.04 కోట్లుకట్టబెట్టారని.. తద్వారా సింగరేణికి రూ. 214 కోట్ల అదనపు భారం పడిందని హరీశ్ రావు ఆరోపించారు. అధిక ధర చెల్లించడమే కాకుండా, సింగరేణికి చెందిన విలువైన భూములను కూడా అప్పనంగా ఇచ్చేశారని మండిపడ్డారు. 

Read More అఖండ-2 అఖండమైన విజయం సాధిస్తుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులపై హరీశ్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెండర్లు వేసిన వారితో సీఎం బావమరిది హోటళ్లలో సమావేశమవుతున్నారని, అందుకే బిడ్ల ప్రక్రియ ఐదారుసార్లు వాయిదా పడుతోందని ఆరోపించారు. సింగరేణిలో కేవలం సోలార్ మాత్రమే కాకుండా, పేలుడు పదార్థాల సరఫరాలోనూ అవినీతి జరిగిందన్నారు. కుంభకోణం ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రెండేళ్లు దాటినా ఇంకా లీక్ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని హరీశ్‌ రావు తెలిపారు.