లక్ష్యం ఉంటేనే విజయం
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్
విశ్వంభర, సూర్యాపేట: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. జిల్లాలోని సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను పరిశీలించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, అభిరామ్, నాగశ్రీ, లాస్య, శివకుమార్ మరియు శృతి వంటి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను కూడా పరిశీలించి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తదనంతరం అదే రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు.అలాగే వంట గదిని పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, కేంద్రంలో శుభ్రతను కాపాడాలని, భోజనాన్ని మంచిగా ఉడకపెట్టి అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అందే పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అదే రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, తహసిల్దార్ కృష్ణయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



