అమెరికాకు దేశాన్ని అమ్మేశారు
ప్రధానిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం దేశానికే సిగ్గుచేటని, భారత్ తన చమురు అవసరాలను ఎక్కడి నుంచి తీర్చుకోవాలో కూడా ఇప్పుడు అమెరికా నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన మండిపడ్డారు.
విశ్వంభర, నేషనల బ్యూరో: బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం దేశానికే సిగ్గుచేటని, భారత్ తన చమురు అవసరాలను ఎక్కడి నుంచి తీర్చుకోవాలో కూడా ఇప్పుడు అమెరికా నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన మండిపడ్డారు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా దేశ సార్వభౌమత్వాన్ని ఇలా వేరే దేశం చేతుల్లో పెట్టలేదని, ఇంధన రంగాన్ని అమెరికా ఒక ఆయుధంగా మార్చుకుని భారత్‌ను శాసిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సూపర్ పవర్ యుగం ముగిసినా, ప్రభుత్వం ఇంకా లొంగుబాటు ధోరణితోనే వ్యవహరిస్తోందని విమర్శించారు.
డేటా భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారతీయుల దగ్గర ఉన్న అపారమైన డేటాపై అమెరికా, చైనాలు కన్నేశాయని, మన ప్రజల ఆలోచనలను, ప్రతిభను పట్టుకోవడానికి అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని హెచ్చరించారు. దేశీయ వస్త్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందని, బంగ్లాదేశ్ ఉత్పత్తులపై సున్నా సుంకం ఉండటంతో మన పరిశ్రమలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అటు ట్రంప్ సుంకాలను పెంచుతుంటే, ఇటు మన ప్రభుత్వం మాత్రం అమెరికన్ ఎగుమతులను ప్రోత్సహిస్తూ మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు స్తంభించిపోయారని, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటల మార్కెట్లను అమెరికాకు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ పొలాల యాంత్రీకరణకు మార్గం సుగమం చేస్తూ భారతీయ రైతుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. "మీరు భారతదేశాన్ని అమ్మేశారు, భారత మాతను అమ్మడానికి మీకు సిగ్గుగా లేదా?" అంటూ ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యవసర రంగాలకు కేటాయింపులు లేని ఈ బడ్జెట్ కేవలం విదేశీ శక్తులకు ఊడిగం చేసేలా ఉందని ఆయన దుయ్యబట్టారు.



