ఉద్యోగులకు ఆరోగ్య వరం.. 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఈహెచఎస్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులతో పాటు ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పథకం అమలులో పారదర్శకత, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై చర్చించారు.
ఈ భేటీలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకాన్ని 15 రోజుల్లోగా ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను వెంటనే సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యకు దీనితో పరిష్కారం లభించనుంది.
ఆర్థికపరమైన నిర్ణయాలు
కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించి కంట్రిబ్యూషన్ విషయంలో ట్రస్ట్ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆరోగ్య పథకానికి మినహాయించనున్నారు. ఉద్యోగులు చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా మరో 1.5 శాతం వాటాను చెల్లిస్తుంది.



