నేనో.. పోలీసులో తేలిపోవాలి
సంగారెడ్డిలో పోలీస్ వర్సెస్ జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఘర్షణకు బీజం పడిందిలా
34వ వార్డు పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ శివకుమార్ కు, అభ్యర్థికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటి, అభ్యర్థి ఏకంగా సీఐ కాలర్ పట్టుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు అభ్యర్థిని పక్కకు నెట్టివేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
రంగంలోకి జగ్గారెడ్డి.. బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం!
తమ అభ్యర్థిపై పోలీసులు చేయి చేసుకున్నారని వార్త తెలియగానే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. "రిగ్గింగ్‌ను అడ్డుకోలేరు గానీ, మా వాళ్లపై ప్రతాపం చూపిస్తారా?" అంటూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పోలింగ్ ఆపేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన చేసిన హెచ్చరికలతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.
నేనో.. పోలీసులో తేలిపోవాలి: జగ్గారెడ్డి
పోలీసులను ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. “రిగ్గింగ్ చేస్తున్నారని మా అభ్యర్థి చెబితే, సీఐ శివకుమార్ గల్లా పట్టుకుంటాడా? ఆ సీఐ నా ముందుకు రావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి కారణం సీఐ, ఈ హోంగార్డులే. నేనో.. పోలీసులో ఈరోజు తేలిపోవాలి!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగ్గారెడ్డి పోలీసులకు వేళ్లను చూపిస్తూ, గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ జగ్గారెడ్డి భీష్మించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో సంగారెడ్డిలో మున్సిపల్ పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. పోలీసులపై దాడికి ప్రయత్నించిన అభ్యర్థిపై, విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.



