గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు ఉక్కుపాదం 

'సిట్' విచారణకు సంచలన ఆదేశం!

గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు ఉక్కుపాదం 

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, వాస్తవాలను వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

విశ్వంభ, ఏపీ బ్యూరో: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, వాస్తవాలను వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ విచారణ అత్యంత పారదర్శకంగా జరగాలని కోర్టు స్పష్టం చేసింది.

ఫోరెన్సిక్ నిపుణులతో 'ట్యాంపరింగ్' గుట్టుమట్లు! 

Read More Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు

ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న 'జవాబు పత్రాల మార్పిడి' ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎంపికైన అభ్యర్థుల పేపర్లు భద్రంగా ఉన్నాయా? లేదా వాటిలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా? అన్నది తేల్చడానికి రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. విజయవాడలో జరిగిన మూల్యాంకన ప్రక్రియలో వాడిన బార్‌కోడ్‌లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని డేటా సరిపోలుతున్నాయో లేదో శాస్త్రీయంగా తనిఖీ చేయాలని ఆదేశించి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

ఉద్యోగులకు షాక్.. 

దర్యాప్తు నిష్పాక్షికంగా సాగాలంటే, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎంపికైన అభ్యర్థులు అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయకుండా చూడాలని కోర్టు భావించింది. ఈ క్రమంలో, గ్రూప్-1 ద్వారా ఎంపికై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అభ్యర్థులందరినీ వెంటనే అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు వారు దర్యాప్తును ప్రభావితం చేసే ఏ స్థానంలోనూ ఉండకూడదని కోర్టు తేల్చి చెప్పింది.

మార్చి 16 గడువు..  
ఈ మొత్తం వ్యవహారంపై సిట్ తన సమగ్ర నివేదికను మార్చి 16వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు గడువు విధించింది. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలు రాసిన తమకు, ఈ తీర్పుతో న్యాయం జరుగుతుందని వేలాది మంది నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే దిశగా హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags: AP