మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు నమోదుపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతపై సీఐ చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతను కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ఘటనలో తప్పు ఎవరిదనేది న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.



