పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి, - హనీఫ్ అహ్మద్

పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి, -  హనీఫ్ అహ్మద్

  • ముస్లిం మైనారిటీల సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలి
  • వారికి  నేటికీ రాజ్యాంగం ఫలాలు అందడం లేదు
  • చట్ట సభల్లో ముస్లిం ప్రాతినిధ్యం పెంచాలి
  • ముస్లింలకు మద్దతుగా ప్రజాస్వామిక వాదులు ఉద్యమం నిర్మించాలి
  • తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సామాజికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనీఫ్ అహ్మద్

విశ్వంభర , మహబూబ్ నగర్: పస్మండ (అత్యంత వెనుక బడిన) ముస్లింలు దేశ వ్యాప్తంగా ఉన్నారని, వారి సమస్యలపై పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో చర్చించాలని, 
అభివృద్ధి సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా 5% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సామాజికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనీఫ్ అహ్మద్ కోరారు. ఈ మేరకు ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన ముస్లింలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరాలని కోరారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కోరారు. సచార్ కమిటీ నివేదిక అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ సహా అనేక కమిటీలు, కమిషన్లు ముస్లింల పరిస్థితి దళితులకున్న గిరిజనుల కన్నా హీనంగా ఉన్నాయని చెబుతున్నాయని తెలిపారు. నేటికీ ముస్లింలపై వివక్ష, అణచివేత, దాడులు కొనసాగడం సిగ్గుచేటు అన్నారు. ఈ దేశ మూల వాసులు అయినా ముస్లింలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాకు అనుగుణంగా ముస్లింలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలని కోరారు. పార్లమెంట్ సహా వివిధ రాష్ట్ర శాసనసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. లౌకిక ఎజెండా ఎంచుకున్న పార్టీలు కూడా ముస్లింల స్థితిగతులపై గొంతు ఎత్తడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు మద్దతుగా ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు. తెలంగాణాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం విస్మరించిందని, వందల ఎకరాల వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం చేసిందని విమర్శించారు.ప్రస్తుత కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఇప్పటికైనా ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలని కోరారు. 40 అసెంబ్లీ సీట్లలో ముస్లిం మైనారిటీలు ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ముస్లిం మైనార్టీ వర్గాల బడ్జెట్లో నిధులు కేటాయించాలని, మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్బంగా హనీఫ్ అహమ్మద్ కోరారు.

Tags: