ఆశావర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

ఆశావర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

విశ్వంభర, నిజామాబాద్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా ధర్నా చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆశావర్కర్లను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ఆశావర్కర్లు కలెక్టరేట్​లోకి  చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఓ ఆశా వర్కర్​ కిందపడి  గాయాలయ్యాయి. కాలికి తీవ్రంగా గాయం కావడంతో పాటు సదరు ఆశా వర్కర్ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే 108 అంబులెన్సులో ఆమెను జీజీహెచ్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసుల తీరుతో ఓ ఆశా వర్కర్ కిందపడి  గాయాలపాలైందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ న్యాయమైన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే   తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Tags: