వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్
విశ్వంభర, నిజామాబాద్: రుణాలు ఇప్పిస్తామని ముందస్తుగానే వడ్డీ వసూలు చేస్తున్న వీక్లీ ఫైనాన్స్ ముఠా సభ్యుల్లో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. సాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి వడ్డీ వసూలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కొత్త బస్టాండ్ వద్ద మాటు వేశారు. ఈ సందర్భంగా ముఠాలో ఇద్దరు వడ్డీ వసూళ్ల రాయుళ్లు రాగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు సత్తి సాయిరాం, రాజులుగా గుర్తించి వారి వద్ద నుంచి వందలాది ప్రామిసరీ నోట్స్, ఖాళీ చెక్కులు, వేలిముద్రలు తీసుకున్న పత్రాలు, బంగారం, నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాళ్లు కామారెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో సైతం ఇలాంటి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.



