రిజినల్ చలాన్లు మా దగ్గరే… లైసెన్స్ మాత్రం వేరే వారికి?
- ఎక్సైజ్ వ్యవహారంలో భారీ అక్రమాలపై ఆరోపణలు
విశ్వంభర, కోదాడ: బార్ లైసెన్స్ బదిలీ వ్యవహారం కోదాడలో సంచలనంగా మారింది. లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ లైసెన్స్ తమకు దక్కలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. కోదాడ పట్టణానికి చెందిన శాఖమూరి కేశవరావు, మిర్యాల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లోని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరంగా తెలియజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.85 లక్షల ఒప్పందం… రూ.42 లక్షలు చెల్లింపు బాధితుల కథనం ప్రకారం… సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన నల్లగొండ అనిత పేరిట ఉన్న ‘శ్రీ చెన్నకేశవ బార్, రెస్టారెంట్’ లైసెన్స్ కొనుగోలు కోసం ఈ ఏడాది జనవరిలో రూ.85 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఉన్న బకాయిలను తీర్చేందుకు మార్చి నెలలో ఎస్‌బీఐ చలానా ద్వారా రూ.42 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఒరిజినల్ చలాన్లు తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు.
అదే చోట కొత్త బార్‌కు అనుమతులు… ఎలా?
లైసెన్స్ తమ పేరుపైకి మారుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ట్విస్ట్ చోటుచేసుకుంది. అదే ప్రదేశంలో ‘న్యూ సాయి స్వగత్ బార్ & రెస్టారెంట్’ పేరుతో కొత్తవారికి లైసెన్స్ జారీ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. “ఒరిజినల్ చలాన్లు మా దగ్గరే ఉన్నాయి. అవి లేకుండా అధికారులు ఎలా లైసెన్స్ మంజూరు చేశారు?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడ్డాయని వారు ఆరోపిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ బకాయిలు చెల్లించాం. అయినా లైసెన్స్ మాకు ఇవ్వకుండా వేరే వాళ్లతో బార్ ప్రారంభించడంలో పెద్ద కుట్ర ఉంది. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలి.శాఖమూరి కేశవరావు, మిర్యాల నాగేశ్వరరావు కోరుతున్నారు.



