రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నైయామకం పై విహెచ్
బీసీ వర్గాల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తా
విశ్వంభర, హైదరాబాదు : కేబినెట్ హోదాతో బాధ్యత అప్పగించడం ప్రస్తుతం కీలక ఘట్టమని, బీసీ వర్గాల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. హైదరాబాదు గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్నానని, ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ అవకాశం తనపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన కర్తవ్యమని తెలిపారు. బీసీ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.



