విద్య ప్రైవేటీకరణపై ఆందోళన : ప్రొ. జి. హరగోపాల్

విద్య ప్రైవేటీకరణపై ఆందోళన : ప్రొ. జి. హరగోపాల్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: విద్య ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాశాయీకరణ ద్వారా పాలకులు రాజకీయ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారని ప్రొ. జి. హరగోపాల్ అన్నారు. పాఠ్య పుస్తకాలలో మతభావజాలాన్ని చొప్పించి సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో  గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామిక భారతాన్ని కాపాడేందుకు ఉపాధ్యాయ ఉద్యమం ముందుండాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించడంలో విద్య కీలకమని పేర్కొన్నారు. అందరికీ సమానమైన, శాస్త్రీయ విద్య ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. కామన్ స్కూల్ విధానం అమలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలని కోరారు. విద్యా కమిషన్ నివేదికలో సామాజిక, మానవీయ కోణంలో సరైన సిఫార్సులు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టత లేని కొత్త విధానాన్ని అమలు చేయకముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ కామన్ స్కూల్ వ్యవస్థ కోసం ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజల ఒత్తిడి పెరగాలని పేర్కొన్నారు. కార్పోరేటీకరణ, అప్రజాస్వామిక పోకడలకు వ్యతిరేకంగా విస్తృత ఐక్యత అవసరమన్నారు. ప్రొఫెసర్  కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ విద్య సంక్షోభంలో ఉందని, దానిని కాపాడేందుకు ఉపాధ్యాయ సంఘాలు, ప్రగతిశీల వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, పి. నాగిరెడ్డి, ఎం. ప్రకాష్ రావు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి. తిరుపతిరెడ్డి, ఎం. రవీందర్, పి. నారాయణమ్మ, డి. శ్రీనివాస్, లక్ష్మయ్య యాదవ్, ఎం. కృష్ణారెడ్డి, రావుల రమేష్, ఏ. భుజంగరావు, డి. రాజయ్య, బి. రాజు, యస్. విజయ్, భోగ రమేష్ తదితరులు, వివిధ జిల్లాల నుంచి టీపీటీఎఫ్ సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.

Tags: