పాత్రికేయుల సమస్యలను పరిష్కరించండి: టీడబ్ల్యూజేఎఫ్

పాత్రికేయుల సమస్యలను పరిష్కరించండి: టీడబ్ల్యూజేఎఫ్

విశ్వంభర, హైదరాబాదు : జర్నలిస్టుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ జి.ముకుందరెడ్డిని కోరారు. సోమవారం సమాచార భవన్‌లో కలుసుకుని పెండింగ్ సమస్యల పత్రాన్ని అందజేశారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడం, ప్రభుత్వ ప్రకటనల బిల్లులు రెండేళ్లుగా చెల్లించకపోవడం వల్ల చిన్న, మధ్యతరహా పత్రికలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పీరియాడికల్స్‌కు ప్రకటనలు నిలిచిపోవడం, ఎంపానల్మెంట్ పెండింగ్‌లో ఉండడం సమస్యలను వివరించారు. ఆర్‌ఎన్‌ఐ, పీఆర్‌జీఐ అనుమతులతో నడుస్తున్న పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడం, కేబుల్ ఛానళ్లకు అక్రెడిటేషన్ విషయంలో స్పష్టత లేకపోవడం, జీవో 252 సవరణ అవసరమని సూచించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, హెల్త్ కార్డులు అమలు కాలేదని తెలిపారు. కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్, సామ్రాట్ గుప్తా, ఎం.రవికుమార్, ఆర్.శ్రీనివాస్ గౌడ్, గోవింద్, రవికుమార్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు

Tags: