పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

  • విద్యా కార్యక్రమాల అమలుపై కీలక ఆదేశాలు
  • రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా

విశ్వంభర, మహాబూబాబాద్:  హైదరాబాదు నుంచి విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై  గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026-2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యం లేని పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వాములు చేస్తూ విద్యా శిబిరాలు, వర్క్ షాప్ లు, బడిబాట, తదితర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. విద్యా వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, తాగునీటి కొరత ఉన్న పాఠశాలల్లో పోర్టల్ ప్రకారం తక్షణమే పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పోర్టల్ లో నివేదికలను సరిగా నమోదు చేయాలన్నారు.కేజీబీవీలలో పది, ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా రెమెడియల్ కోచింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల కోసం వేసవి క్యాంపులు నిర్వహించి, సప్లిమెంటరీ కోచింగ్ ఇవ్వాలన్నారు. అనంతరం విద్యా శాఖ సంచాలకులు మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు, పాఠశాల విద్య కమిటీలతో వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. బడిబాట అండ్ పిటిఎం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కింద విద్యార్థుల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బడి బాటపై ర్యాలీలు చేపట్టి, అవగాహన పెంపొందించాలన్నారు. డ్రాపౌట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తిరిగి బడిలో చేర్పించాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడానికి జిల్లా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. బాలబాలికల భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, చేతి కళలు వంటి కార్యక్రమాలను నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు.  వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియేట్ అధికారి మధార్, విద్యాశాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: