ఉపాధి కూలీలకు వసతులు కరువు
విశ్వంభర, అనంతగిరి: ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టి ఉపాధి హామీ కూలీలను పనులు జరిపిస్తున్న వైనం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరుగుతోంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో కూలీలకు వందరోజుల పని కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూలీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారికి వేతనంతో పాటు పలు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. కానీ ఈ ఆచరణ మాత్రం నామమాత్రంగానే మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరుగుతుంది. కూలీలకు కల్పించాల్సిన తాగునీరు వసతి ఆచూకీ కరువైంది. కూలీలు పనిచేసే చోట వారి కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉండగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు , అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు కనబడడం లేదు. కూలీలు వాడే పనిముట్లు పనిచేయడానికి అవసరమైన పనిముట్లు ప్రభుత్వమే సమకూర్చాలి. కానీ అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఎవరికి వారే కూలీలు సొంతంగా పనిముట్లు తెచ్చుకొని పనిచేస్తున్న వైనం కూడా కనిపిస్తూనే ఉంది. ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం కూలీలు విశ్రాంతి తీసుకోవడానికి పనిచేసే ప్రదేశంలో టెంట్లు లేదా నీడ సౌకర్యం కూడా కనిపించాల్సి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా కూలీలు ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలు కాకుండా ఈ చర్యలు కల్పించాలి కానీ అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. పనిచేస్తున్న సమయంలో కూలీలకు ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలి. ఇవి కూడా అందుబాటులో లేక కూలీలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కూలీలకు పని కల్పించిన నాటి నుండి ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అధికారులు ఏ గ్రామంలో కూడా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. దీనికి తోడు రోజుల తరబడి పనిచేస్తున్న కూలీలకు సమయానుకూలంగా వేతనాలు చెల్లించడంలో కూడా జాప్యం జరుగుతుందని కూలీలు వాపోతున్నారు. వేసవికాలంలో అత్యవసర వేతనంగా భావించే ఉపాధి హామీ పథకం లో కూడా కనీస అవసరాలు తీర్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కూలీలు ఉపాధి హామీ పనికి వచ్చేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. ఉపాధి హామీ పనుల నిబంధనలకు సంబంధించి ఆయా గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో యొక్క సూచన మేరకు కూలీలకు వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటుంది.ఈ మేరకు కూలీలకు ఏర్పాటు చేయవలసిన వసతులు గురించి కూడా అధికారులు వారికి తెలియపరచకపోవడం విశేషం. కనీసం గ్రామసభలలో కూడా ఉపాధి హామీ వసతుల గురించి చర్చలు కూడా కరువయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూలీలకు భారంగా మారాయి.ఈ నేపథ్యంలో అధికారులు తగిన వసతులు కల్పించి వారి సురక్షితను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు విధించిన వసతులు కల్పించాలని మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలకు కూలీలు వాపోతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారి అయిన ఎంపీడీవోను వివరణ కొరకు చరవాణి ద్వారా సoప్రదించగా స్పందించలేదు



