ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతి
- అధికారుల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్ల ధ్వజం
- ప్రజల నీళ్లు పరిశ్రమలకు విక్రయం
- ఒకే కాంట్రాక్టర్‌కు 11 పనులు.. పారదర్శకత ఎక్కడ
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
విశ్వంభర, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పాలన అవినీతిమయంగా మారిందని, అధికారుల అండదండలతో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు అధికారుల పనితీరును ఎండగట్టారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఉచితంగా సరఫరా చేయాల్సిన తాగునీటిని, అధికారులు అపార్ట్‌మెంట్లు ,పరిశ్రమలకు దొంగచాటుగా విక్రయిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. సాధారణ ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే, వాణిజ్య అవసరాలకు నీటిని మళ్లించడం వెనుక భారీగా ముడుపులు అందుతున్నాయని విమర్శించారు.మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఒకే కాంట్రాక్టర్‌కు ఏకంగా 11 పనులను ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. ఇందులో మున్సిపల్ చైర్‌పర్సన్ కుటుంబ సభ్యుల జోక్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి పన్నుల వసూళ్లు, మున్సిపల్ బడ్జెట్ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు.డంప్‌యార్డ్ నిర్వహణ, చెత్త తరలింపు బిల్లుల చెల్లింపులో పారదర్శకత లేదని, సి.ఎస్.ఆర్ (CSR) నిధులను వార్డుల అభివృద్ధికి వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి మరియు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని నాయకులు హెచ్చరించారు.అధికారులు తమ తీరు మార్చుకోకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



