సౌభ్రాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ
- డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బోడుప్పల్ కూతుబ్ షాహీ అలంగిర్ మస్జీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ముస్లిం సోదరులు పరస్పరం అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ నివాసంలో ముస్లిం నాయకులు, మస్జీద్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ యాకూబ్ ఆధ్వర్యంలో కలుసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసాల ద్వారా సహనం, సేవాభావం, దాతృత్వం పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి పండుగలు జరుపుకోవడం మన సంస్కృతికి నిదర్శనం అని అన్నారు. అలాగే పేద ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులు వంటి కార్యక్రమాలు చేపడుతోందని, అన్ని రంగాలలో అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్, మహబూబ్ అలీ, అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ సమి, మీరావళి, హమీద్, అలీ, మొయిన్, అక్బర్, గౌస్, బోలేష్, పాషా, షఫీ, ఉరూజ్ తదితరులు పాల్గొన్నారు.



