సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన

సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన

విశ్వంభర, సిద్దిపేట: ఈనెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న సందర్భంగా అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డిలతో కలిసి సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటుచేసే ప్రదేశాలను శుక్రవారం పరిశీలించి తగిన సూచనలు చేశారు. రైతు మహోత్సవ ప్రదేశంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హైమావతి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేస్తున్నామని, హెలిఫ్యాడ్, సీఎం కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, తాగునీరు వసతి, పారిశుద్ధ్య, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీవో రవీందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు.

Tags: