జర్నలిస్టులకు మొండి చెయ్యి 

జర్నలిస్టులకు మొండి చెయ్యి 

  • టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

విశ్వంభర, హైదరాబాదు : బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం తీవ్ర అన్యాయమని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై ప్రస్తావన లేకపోవడం, నిధులు కేటాయించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ మీడియా వర్గాలను విస్మరించారని విమర్శించారు. గత రెండేళ్లుగా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని, సమాచార పౌర సంబంధాల శాఖను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చిన్న, మ ధ్యతర పత్రికలకు ఇచ్చిన ప్రకటనల బిల్లులు కూడా చెల్లించకపోవడం విచారకరమని తెలిపారు. మీడియా అకాడమీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని కూడా ప్రస్తావించారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టత లేకపోవడం, కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయకపోవడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తమైంది. మరణించిన జర్నలిస్టులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకెళ్లినా స్పందన లేకపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల్లో బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని, మీడియాపై నిర్లక్ష్యాన్ని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags: