బోడుప్పల్ లో ఘనంగా రంజాన్
విశ్వంభర, బోడుప్పల్: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ ప్రాంతంలో స్నేహభావం, సామరస్యానికి ప్రతీకగా నిలిచే కార్యక్రమం జరిగింది. పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, బండి శ్రీరాములు గౌడ్, బండి సతీష్ గౌడ్, వారి చిన్ననాటి మిత్రులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు కలిసి షేక్ సైదాబీ – ఖాజా ఖాన్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలుసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఖాజా ఖాన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను అందరినీ కలుపుకుని జరుపుకోవడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా షేర్ కుర్మా విందు గురించి మాట్లాడుతూ, ఖాజా ఖాన్ ఇంటి ప్రత్యేకతగా నిలిచే ఈ వంటకం ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు, అతిథి సత్కారం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా ఆహ్వానించి పండుగ ఆనందాన్ని పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, మిత్రులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ మన సమాజంలో స్నేహభావం, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.



