బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రోళ్ల మహేష్ ధ్వజం
- 21న రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ ప్రతుల దహనానికి పిలుపు
విశ్వంభర, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని కోల్పోయిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. బడ్జెట్ కేటాయింపులు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రోళ్ల మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 శాతం హామీ ఎటు పోయింది?, మొత్తం బడ్జెట్ రూ. 3,24,234 కోట్లు కాగా, విద్యారంగానికి కేటాయించింది కేవలం రూ. 26,674 కోట్లు (8.22%) మాత్రమేనని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో 15% కేటాయిస్తామని చెప్పి, కనీసం 10 శాతానికి కూడా చేరుకోకపోవడం విద్యార్థులను వంచించడమే. ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదు అని విమర్శించారు. ఉస్మానియా, కాకతీయ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కొరత పీక్ స్టేజ్‌లో ఉందని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన నిధులే విడుదల కాలేదని, ఇప్పుడు మళ్ళీ 'అంతర్జాతీయ స్థాయి' అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కోఠి మహిళా వర్సిటీకి గతంలో కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండానే, మళ్ళీ రూ. 400 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 9,500 కోట్లు పేరుకుపోతే, బడ్జెట్‌లో కేవలం రూ. 4,343 కోట్లు మాత్రమే చూపారని మండిపడ్డారు. పాత బకాయిల చెల్లింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు శిథిలావస్థలో ఉన్నాయని, వందల సంఖ్యలో ఉన్న హాస్టళ్ల రెనోవేషన్ కోసం కేవలం రూ. 100 కోట్లు కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వర్షం వస్తే కురిసే గదులు, సరైన ఆహారం లేక విద్యార్థులు అల్లాడుతున్నారని అన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బడ్జెట్ ప్రతులను దహనం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.



