గూగుల్ సెర్చ్ చేస్తున్నారా? జాగ్రత్త.. సైబర్ కేటుగాళ్ల ‘SEO’ ట్రాప్ పై సీపీ సజ్జనార్ హెచ్చరిక
గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో మనం ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు మొదట కనిపించే వెబ్‌సైట్లన్నీ అసలైనవి కావని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో మనం ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు మొదట కనిపించే వెబ్‌సైట్లన్నీ అసలైనవి కావని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు అత్యంత అధునాతన ఎస్‌ఈఓ పద్ధతులు, పెయిడ్ యాడ్స్ ఉపయోగించి తమ నకిలీ వెబ్‌సైట్లను సెర్చ్ రిజల్ట్స్‌లో ముందు వరుసలో ఉంచుతున్నారని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు. సాధారణంగా వినియోగదారులు పైన కనిపించే లింక్‌లే నిజమైనవని నమ్మి క్లిక్ చేస్తారని, ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోందని పేర్కొన్నారు.
బ్యాంకింగ్, కస్టమర్ కేర్ వివరాలే టార్గెట్
ముఖ్యంగా కస్టమర్ కేర్ నంబర్లు, బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ పేమెంట్లకు సంబంధించిన సమాచారం కోసం వెతికేవారు ఈ ట్రాప్ లో చిక్కుకుంటున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ నకిలీ సైట్లు చూడటానికి అసలైన బ్యాంకు లేదా ప్రభుత్వ పోర్టల్‌ను పోలి ఉండి, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయి. వెబ్‌సైట్‌లోకి ప్రవేశించగానే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను సేకరించి, క్షణాల్లో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సీపీ సజ్జనార్ వివరించారు. 'స్పాన్సర్డ్' అని ఉన్న ప్రతి లింక్‌ను నమ్మవద్దని, వెబ్‌సైట్ అడ్రస్‌ను ప్రతిక్షణం క్షుణ్ణంగా పరిశీలించాలని సజ్జనార్ సూచించారు.
గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మోసం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఈ సమయంలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీపీ వెల్లడించారు. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్లను నేరుగా బ్రౌజర్‌లో టైప్ చేసి ఓపెన్ చేయడం, నమ్మకమైన యాప్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపడం సురక్షితమని ఆయన పేర్కొన్నారు.
జాగ్రత్తలు ఇవే..
సెర్చ్ ఇంజన్లలో వచ్చే మొదటి లింకులను కళ్లు మూసుకుని నమ్మకండి. వెబ్‌సైట్ అడ్రస్‌లో అక్షర దోషాలు ఉన్నాయేమో గమనించండి. కస్టమర్ కేర్ నంబర్ల కోసం నేరుగా ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లకే వెళ్లండి. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులపై క్లిక్ చేయవద్దు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.



