ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అన్ని విభాగాల అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల నుండి వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా భూమి రికార్డుల సవరణ, వారసత్వ మ్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అన్నారు. సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాల కోసం వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అన్నారు. మురుగునీటి కాలువలు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన పూజరి సుశీల తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన స్లాబ్ పూర్తి చేసి వేరిఫికేషన్ పూర్తయి సాంక్షన్ కాని డబ్బులను వెంటనే ఇప్పించగలరని కోరారు. ఇనుగుర్తి మండలం మీట్యాతండ కు చెందిన రైతులు తాము గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని అట్టి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములకు పట్టాలను మంజూరు చేసి ఇవ్వాలని కోరారు. పట్టణంలోని బేతోల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామంలోప్రభుత్వ పాటశాల కు చెందిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి వేరొకరికి అమ్మారని అట్టి స్థలాన్ని విచారణ చేసి సమస్యని పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 131 దరఖాస్తులను పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్.పి సీ ఈఓ పురుషోత్తం, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, డి.ఎం.ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ, మైనారిటీ డెవలప్మెంట్ అధికారులు, శ్రీనివాసరావు, డి.పి.ఓ హరిప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి సరిత,జిల్లా సంక్షేమ అధికారి సబిత,డి.ఎం. సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, జిల్లా ఉపాధి అధికారి రజిత, ఎల్.డి.యం యాదగిరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపరింటెండెంట్ మదన్ మోహన్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, మండలాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



