పాఠశాల బస్సుల తనిఖీ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాల, కళాశాల బస్సు డ్రైవర్లపై ప్రత్యేక డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో సమన్వయంతో బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్సులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణ భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించరాదని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ఒక తీవ్రమైన నేరమని, ముఖ్యంగా పాఠశాల బస్సుల డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అన్ని విద్యాసంస్థలు తమ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల పరిస్థితిపై అవగాహన ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతను కాపాడడంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.



