రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఖూనీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఖూనీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆరోపించారు.

మహిళల పట్ల కాంగ్రెస్ నేతల అసభ్య ప్రవర్తన
మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించడం సరికాదని, మంత్రి వివేక్ సైతం పట్టించుకోలేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మద్యం మత్తులో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లను అగౌరవపరిచారని ఆరోపించారు. కానీ ఈ విషయాన్ని మంత్రి సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంత జరిగినా ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు చుట్టంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Read More పేరుమండ్లగూడెం సర్పంచ్ దూపెల్లి రాకేష్ ప్రమాణస్వీకారంలో - ముఖ్యఅతిథిగా పాల్గొన్న  ఎమ్మెల్యే నాగరాజు 

పోలీసుల అత్యుత్సాహంపై హెచ్చరిక
బాల్క సుమన్‌ను సమీపంలో ఉన్న జైల్లో పెట్టకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు తరలించడం అన్యాయమని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీకి పట్టదా అని ఆయన నిలదీశారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టంలా వ్యవహరిస్తున్నారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆయన హితవు పలికారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.