ప్రభుత్వ పాఠశాలల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కురవి మండలం నేరేడ జడ్.పి.హెచ్.ఎస్ లను బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్య బోధనలను స్వయంగా పరిశీలించారు, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని , రానున్న పదవ తరగతి పరీక్షల్లో అన్ని విద్యాసంస్థలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలని సూచించారు. పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. అంతకుముందు పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తరగతి గదులు పరిశీలించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించాలని సూచించారు.



