50 శాతం రాయితీ పై వ్యవసాయ పరికరాలు
- ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
విశ్వంభర, దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం పెద్దపీట వేస్తుందని, వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీపై అందించే పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన1 కోటి 16 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యయం తగ్గడంతోపాటు ఉత్పత్తుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి యంత్ర పరికరంపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా దేవరకొండ డివిజన్ కి 1759 పనిముట్లు గాను 1కోటి 16 లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు.



