కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణలు

కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణలు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని వేల కోట్లు సంపాదించారని కడియం ఆరోపించారు. ఈ ఆస్తుల వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ 'జాతిపిత' ఎవరు?
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడాన్ని కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ కోసం ఆయన ఏం చేశారని జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు. అధికారాన్ని ఒక కుటుంబ హక్కుగా భావిస్తున్నారని, తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం అనేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ స్కాములు చేశారని, వారిపై కేసులు ఉన్నాయని కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులపై కేసులు ఉంటే తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య సొత్తా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్‌ను వాడుకుంటారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు తిరస్కరించినా అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రాలేదని విమర్శించారు. అధికారాన్ని తమ హక్కుగా భావించే ధోరణి ఇకనైనా మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

Read More కనబడుటలేదు