హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రానున్న 2026-27 బడ్జెట్‌లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిధులు కేటాయించకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రెండు బడ్జెట్లలో హామీల అమలుకు నిధులు కేటాయించని ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.
మహిళలు, రైతులు, యువతకు ద్రోహం
ఆరు గ్యారెంటీలలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలుగా బకాయిపడ్డ హామీలకు, నిధులకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా క్షమాపణ చెప్పాలని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నారు.
ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం - హెచ్చరించిన కేటీఆర్
పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై కాంగ్రెస్ పాపాలను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. "ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తాం" అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.



