అవినీతి ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్‌కు అందిన ఫిర్యాదుల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం జరిపిన విచారణలో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త విద్యుత్ కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు వంటి పనుల కోసం ఈ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేసినట్లు తేలింది. ముఖ్యంగా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ వేదికల ద్వారా లంచాలను స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
అవినీతిపై కఠిన వైఖరి
అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం, విచారణాధికారుల నివేదిక ఆధారంగా ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇంటెలిజెన్స్ విభాగం సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య విద్యుత్ శాఖలో అవినీతికి పాల్పడే ఇతరులకు హెచ్చరికగా నిలుస్తుందని భావిస్తున్నారు.



