కంటోన్మెంట్‌లో ఎన్నికలు నిర్వహించాలి

కంటోన్మెంట్‌లో ఎన్నికలు నిర్వహించాలి

  • ఎంపీ ఈటల రాజేందర్ 

 విశ్వంభర, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో తక్షణ ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.  కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి  ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి, పాలక మండలి ఏర్పాటు చేయాలని చెప్పారు.  ⁠ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలని అన్నారు.  ⁠దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ లో  ఉన్నాయని , ⁠కేవలం సికింద్రాబాద్ లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనలో పారదర్శకత కోసం ఎన్నికలు జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.  ⁠సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇటీవల రెండోసారి పదవీకాల విస్తరణ పొందిన భానుక నర్మదా మల్లికార్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు.  ⁠ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు.  ⁠అయితే నామినేటెడ్ సభ్యులతో కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారానే అన్ని వార్డుల ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని అన్నారు.  ⁠కంటోన్మెంట్ అంటే కేవలం మిలటరీ ప్రాంతమనే భావన తప్పని ,  ⁠కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇతర పట్టణ ప్రాంతాల ప్రజలకు ఉన్న హక్కులు, సదుపాయాలు సమానంగా ఉండాలని చెప్పారు.  ⁠రోడ్లు, మౌలిక సదుపాయాలు, పాత ఇండ్ల సమస్యలు వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.  ⁠ప్రజాప్రతినిధుల సలహాలు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ⁠కంటోన్మెంట్‌లోని అన్ని డివిజన్లలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని అన్నారు.  రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.  ⁠అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్తారు కానీ మేము ఇక్కడే ఉంటామని అన్నారు.  ⁠కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పారు.

Tags: