హామీలను అమలు చేయకపోతే ఉద్యమిస్తాం
- తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగా రెడ్డి
విశ్వంభర, మహేశ్వరం : ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం కొలువుదీరి 26 నెలలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల అమలులో దారుణమైన జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 26 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తకపోవడం మహిళా లోకాన్ని వంచించడమే, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్ రూ.4000లకు, దివ్యాంగుల పింఛన్ రూ.6000లకు పెంచుతామని, ఆడబిడ్డ వివాహానికి తులం బంగారం, చదువుకునే అమ్మాయిలకు స్కూటిలంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, కాలయాపన చేస్తూ తత్సారం చేయడం అన్యాయం, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పింఛన్లు ఇవ్వడంపై సాక్షాత్తూ హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ సాధనలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని , ఇప్పటికైనా ప్రభుత్వం కుంటి సాకులు మానుకొని, తక్షణమే పెంచుతామన్న పింఛన్లను మహిళలకు ఇస్తామన్న నగదును విడుదల చేయాలని, ఈ ఆర్థికసంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ లో నైన మ హిళ లకు, వృద్దులకు, దివ్యాంగులకు, ఉద్యమకారులకు, రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా కేటాయింపులు చెయ్యాలని అన్నారు. లేనిపక్షంలో రాజకీయ పార్టిగా ఎర్పడుతున్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.



