యూరియా కొనుగోళ్ళలో అదనపు బాదుడు     

విశ్వంభర, రామన్నపేట:  ప్రతీ బస్తా యూరియాపై గరిష్ట అమ్మకం ధర ప్రభుత్వం నిర్ణయించాక అందరూ అదే ధరకు అమ్మాలి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎరువుల డీలర్లు మాత్రం యూరియా ఒక్కో బస్తా పై 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు.  అదేమిటని ప్రశ్నిస్తే సరకు రవాణా చార్జీలు, హమాలీ చార్జీలు అంటూ రైతుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం యూరియాకు ఎంఆర్పీ నిర్ణయించినప్పటికీ, కొందరు డీలర్లు ఒక్కో బస్తాపై అదనంగా డబ్బులు అడుగుతూ,  అదనపు చార్జీలు చెల్లించకుండా యూరియా ఇవ్వమని నిరాకరిస్తున్నారు. ఇదివరకు ఎంతకు అమ్మినా పట్టించుకునే వారు లేక నడిచిందని, ఇప్పుడు ఆన్-లైన్ లో అమ్మకం అయ్యాక కూడా ఈ అదనపు వసూళ్ళు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న పేద రైతులు, సాగు సీజన్‌లో మరింత భారాన్ని మోసే పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఇది రైతులను మోసం చేయడమే కాకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం, కృత్రిమ కొరతను సృష్టించడం అవుతుంది. కావున వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే తనిఖీలు నిర్వహించి, ఇటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుని, యూరియాను ఎలాంటి అక్రమ అదనపు వసూళ్లు లేకుండా కేవలం ఎంఆర్పీ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.

Tags: