ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు 

 ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం  నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తి ఉత్సాహాల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి పాదార్చనాభిషేకం, కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేదఘోషలు, మంగళవాయిద్యాల మధ్య జరిగిన ఈ  కల్యాణం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికతో నింపింది.  అగ్నిగుండాల కార్యక్రమం. తెల్లవారుజామున నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. . "హర హర మహాదేవ" నినాదాలతో మల్లన్న గుట్ట మారుమోగింది. కొండపై ఉన్న పవిత్ర కోనేటి స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కోనేటిలో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కొండల గుహల్లో మునులు తపస్సు చేసిన ప్రదేశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. “స్వర్ణ సింహ బ్రహ్మ కంకణ పుర స్కృతులు”, “శతాధిక ప్రతిష్టాచార్య” సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం త్రిశూల స్నానం, గెలుపు ఉత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాతలను సన్మానించారు.

Tags: